అనంతపురం, మీకోసం న్యూస్: అనంతపురం డంపింగ్ యార్డులో రూ.17.5 కోట్ల వ్యయంతో ఫ్రెష్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు.
మంగళవారం డంపింగ్ యార్డును అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించిన వారు చెత్త ప్రాసెసింగ్ పనుల పురోగతిని సమీక్షించారు. పనుల్లో జాప్యంపై కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.
అక్టోబర్ 2 నాటికి డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. మరోసారి నిర్లక్ష్యం కనిపిస్తే కాంట్రాక్టులను రద్దు చేసి బ్లాక్‌లిస్ట్‌లో చేర్చుతామని హెచ్చరించారు.
చైర్మన్ పట్టాభిరామ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అనంతపురం డంపింగ్ యార్డులో 3.78 లక్షల టన్నుల చెత్తను వదిలివెళ్లిందని, ప్రస్తుతం అందులో 2.41 లక్షల టన్నుల చెత్తను తొలగించినట్లు తెలిపారు.
ఇకపై వారానికో లక్ష్యం నిర్ధేశించి పనులు వేగవంతం చేస్తామని, ప్రత్యేక యంత్రాలతో రోజుకు 4 వేల టన్నుల చెత్తను ప్రాసెస్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
కొత్తగా వచ్చే చెత్తను శాస్త్రీయంగా నిర్వహించేందుకు రోజుకు 170 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఫ్రెష్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 నాటికి ప్లాంట్‌కు అవసరమైన స్థలాన్ని సిద్ధం చేస్తామని వెల్లడించారు.
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో చెత్త నిర్వహణను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. అక్టోబర్ 2 నాటికి అనంతపురం డంపింగ్ యార్డును పూర్తిగా చెత్తరహితంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఫ్రెష్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ పనులను కూడా అదే రోజున ప్రారంభించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు.
0 కామెంట్‌లు