పేపర్ లీకులకు నిరసనగా అనంతపురంలో AISA ఆందోళన

అనంతపురం: దేశవ్యాప్తంగా పేపర్ లీకులు, విద్యా–పరీక్షల వ్యవస్థలో పెరుగుతున్న అవినీతి, నిరుద్యోగ యువత భవిష్యత్తుతో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొనసాగుతున్న ఉద్యమానికి సంఘీభావంగా సోమవారం అనంతపురంలోని గాంధీ విగ్రహం వద్ద AISA ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యుడు పోలా లక్ష్మీనారాయణ, AISA జిల్లా కన్వీనర్ బాలకృష్ణ మాట్లాడుతూ.. వరుసగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీల కారణంగా లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యత లోపించడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ను రద్దు చేయాలని, ప్రశ్నాపత్రాల లీకేజీలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మహేష్, సూరి, నితీష్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు