2019లో టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021కే పోలవరం పూర్తయ్యేది: మంత్రి నిమ్మల రామానాయుడు
2028 డిసెంబర్ నాటికి 36 ప్రధాన ప్రాజెక్టుల పూర్తి లక్ష్యం – జలవనరుల శాఖ శ్వేతపత్రం విడుదల
అమరావతి, మీకోసం న్యూస్:
2019లో తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే 2021 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాల కారణంగా పోలవరం ప్రాజెక్టు తీవ్రంగా దెబ్బతిందని ఆయన ఆరోపించారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.
సచివాలయంలో సోమవారం జలవనరుల శాఖకు సంబంధించిన శ్వేతపత్రాన్ని విడుదల చేసిన మంత్రి, రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, వాటి పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనులపై గత, ప్రస్తుత ప్రభుత్వాల పనితీరును పోల్చి వివరించారు.
మంత్రి మాట్లాడుతూ.. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం పనులు వేగంగా జరిగి సుమారు 72 శాతం వరకు పూర్తయ్యాయని తెలిపారు. అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో అప్పటి ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థలను తొలగించడం వల్ల ప్రాజెక్టు పనులు 17 నెలల పాటు పూర్తిగా నిలిచిపోయాయని విమర్శించారు. ఈ నిర్ణయం తీసుకోవద్దని పలువురు నిపుణులు, అధికారులు హెచ్చరించినప్పటికీ వాటిని పట్టించుకోలేదన్నారు.
పనులు నిలిచిపోవడం వల్ల 2020లో గోదావరి వరదల సమయంలో డయాఫ్రమ్ వాల్ తీవ్రంగా దెబ్బతిన్నదని, దీనివల్ల ప్రాజెక్టు నిర్మాణం మరింత వెనుకబడిందని తెలిపారు. ఈ విషయాన్ని సాంకేతిక నిపుణులే స్పష్టం చేశారని మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా పోలవరం నిర్వాసితుల పునరావాసం విషయంలో కూడా గత ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోలేక ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.
గత ఐదేళ్లలో జలవనరుల రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, ప్రస్తుతం దానిని పునర్నిర్మించి పూర్వ వైభవానికి తీసుకురావడానికి ప్రభుత్వం కార్యాచరణతో ముందుకు సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం ద్వారా రైతులకు నీటి కొరత లేకుండా చూడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
2028 డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 36 ప్రధాన జలవనరుల ప్రాజెక్టులను వివిధ దశల్లో పూర్తి చేసేలా సమగ్ర కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు తాగునీరు, సాగునీరు అందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో చర్యలు చేపడుతోందన్నారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ, నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జలవనరుల రంగంలో గతంలో జరిగిన నష్టాన్ని పూడ్చి రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
– మీకోసం న్యూస్
0 కామెంట్‌లు