వాషింగ్టన్, జూలై 16 (మీకోసం న్యూస్): అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఒక డాలర్ ($1) నాణేన్ని విడుదల చేయనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ మింట్ ప్రకటించింది. ఈ నాణేపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రం ఉండనుండగా, ఈ విషయాన్ని ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు.
నాణెం ఒకవైపు ట్రంప్ చిత్రంతో పాటు "LIBERTY", "1776–2026" సంవత్సరాలు, "IN GOD WE TRUST" అనే వాక్యం ముద్రించనున్నారు. మరోవైపు రెక్కలు విప్పిన అమెరికా జాతీయ పక్షి గద్ద, మధ్యలో 250 సంఖ్యతో కూడిన షీల్డ్, చుట్టూ "UNITED STATES OF AMERICA", "ONE DOLLAR" అనే అక్షరాలు ఉంటాయి.
ఈ సందర్భంగా స్కాట్ బెస్సెంట్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలకు గుర్తుగా ఈ ప్రత్యేక బంగారు రంగు నాణేన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు. ఇది స్వేచ్ఛ, దేశభక్తి, అమెరికా విలువలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అమెరికాలో సాధారణంగా జీవించి ఉన్న అధ్యక్షుల చిత్రాలను కరెన్సీపై ముద్రించరాదనే నిబంధన ఉన్నప్పటికీ, 250వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికల కోసం చట్టంలో మినహాయింపులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. 1926లో అప్పటి అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ చిత్రంతో ప్రత్యేక నాణెం విడుదలైన విషయాన్ని కూడా గుర్తు చేశారు.
అయితే ఈ ప్రత్యేక నాణెం విడుదల తేదీ, ఎన్ని నాణేలు ముద్రిస్తారనే వివరాలను అమెరికా ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
0 కామెంట్‌లు