P. రొప్పాల, జూలై 15 (మీకోసం న్యూస్): ప్రజలతో పోలీసుల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం, గ్రామాల్లో శాంతిభద్రతలను పటిష్టం చేయడం లక్ష్యంగా శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం P. రొప్పాల గ్రామంలో బుధవారం రాత్రి పోలీసుల గ్రామసభ నిర్వహించారు. రొద్దం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కుళ్లాయ్ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సమావేశంలో ఎస్‌ఐ మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు వారికి ద్విచక్ర వాహనాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని, అలా చేస్తే రూ.5,000 జరిమానాతో పాటు వాహన యజమానిపై కూడా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను వాహనాలు నడపకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో చిన్నారులను ఒంటరిగా వదిలివేయొద్దని, అపరిచితులను ఇంట్లోకి అనుమతించవద్దని సూచించారు. గ్రామస్తులు కుటుంబ సమేతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ముందు పోలీసులకు సమాచారం అందిస్తే, ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సీసీ కెమెరాల పర్యవేక్షణతో భద్రత కల్పిస్తామని తెలిపారు.
దొంగతనాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలు, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, భూ వివాదాలను చట్టబద్ధంగా పరిష్కరించుకోవడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా ఎలాంటి నేర సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలి
గ్రామస్తులు సమావేశంలో మాట్లాడుతూ మడకశిర, పెనుకొండ, సోమందేపల్లి ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందని, దీనిని అరికట్టాలని కోరారు. అలాగే బోర్‌వెల్ విద్యుత్ కేబుళ్ల చోరీలు, దేవాలయాల్లో దొంగతనాలు పెరుగుతున్నాయని, వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన ఎస్‌ఐ కుళ్లాయ్ రాజ్ అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని, దొంగతనాలు, అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సహకారంతోనే గ్రామాల్లో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయగలమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

0 కామెంట్‌లు