ప్రతి పంచాయతీకి రూ.2 కోట్లు.. అభివృద్ధికి పెద్దపీట: మంత్రి సవిత

 



గోరంట్ల, జూలై 4 (మీకోసం న్యూస్): వీబీ-జీ రామ్ జీ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ.2 కోట్ల చొప్పున నిధులు కేటాయించి రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపడతామని  మంత్రి ఎస్. సవిత తెలిపారు.

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వానవోలు గ్రామంలో రూ.1.97 కోట్లతో నిర్మించనున్న శ్రీ రంగనాథస్వామి దేవాలయానికి శనివారం భూమిపూజ చేసిన మంత్రి, అనంతరం రూ.70 లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ (OHSR) ట్యాంకును ప్రారంభించారు.

మంత్రి మాట్లాడుతూ, పెనుకొండ నియోజకవర్గంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.6.45 కోట్లతో దేవాలయాల మరమ్మతులు, నూతన ఆలయాల నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. టీటీడీ నిధుల నుంచి రూ.8 కోట్లు మంజూరయ్యాయని, అందులో రూ.5 కోట్లతో పెనుకొండలో కల్యాణమండపం, మరో రూ.3 కోట్లతో 12 భజన మండళ్లు, దేవాలయాలకు మైక్ సెట్లు తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.

వీబీ-జీ రామ్ జీ పథకం కింద 125 రోజుల ఉపాధి కల్పించి, రోజుకు రూ.312 వేతనం చెల్లిస్తామని తెలిపారు. పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు. గోరంట్ల మండలంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలకు రూ.93 లక్షలు, ఓవర్ హెడ్ ట్యాంకులకు రూ.70 లక్షలు ఖర్చు చేశామని తెలిపారు. ఓనవోలు–కొలింపల్లి బీటీ రోడ్డుకు రూ.5 కోట్లు వెచ్చిస్తున్నామని, ఓనవోలు–గుంటుపల్లి రహదారిని నెల రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు.

ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం (SIR)లో ప్రతి ఓటరు తప్పనిసరిగా వివరాలు సమర్పించాలని, లేకపోతే ఓటు కోల్పోయే అవకాశం ఉంటుందని ప్రజలకు సూచించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి సవిత, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాయలసీమ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. రూ.16,350 కోట్లతో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవుతోందని, దీంతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ విషయంలో మాజీ సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ, అభివృద్ధి క్రెడిట్ తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు