,
సోమందేపల్లి జులై 04(మీకోసం న్యూస్ ): ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని రోడ్లపై విచ్చలవిడిగా సంచరించే పశువులను నియంత్రించేందుకు సోమందేపల్లి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రోడ్లపై వదిలేసే పశువుల కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ అంతరాయం, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో పశువుల యజమానులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.పశువులను గుర్తించేందుకు ప్రతి పశువుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ అమర్చాలని, సంబంధిత అధికారులు నిర్వహించే ట్యాగింగ్ కార్యక్రమంలో యజమానులు పాల్గొనాలని కోరారు. ట్యాగ్ ద్వారా యజమాని వివరాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవడం సులభమవుతుందని తెలిపారు.
అలాగే రోడ్లపై తిరిగే పశువులను గుర్తించిన వెంటనే డేటా నమోదు చేసి, ట్యాగ్ లేని పశువులకు ట్యాగ్ అమర్చే ప్రక్రియ చేపడతామని వెల్లడించారు. ట్యాగ్ ఉన్నప్పటికీ పశువులను రోడ్లపై వదిలేస్తే వాటిని గోశాలలకు తరలించే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిబంధనలు ఉల్లంఘించి పశువులను రోడ్లపై వదిలిన యజమానులపై రూ.5 లక్షల వరకు జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. పశువుల సంరక్షణ ప్రతి యజమాని బాధ్యత అని, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఏవైనా సమాచారం ఇవ్వాలనుకుంటే డయల్ 100 లేదా 94407 96108కు సమాచారం అందించాలని సోమందేపల్లి పోలీసులు సూచించారు. ప్రజల సహకారంతో రోడ్డు ప్రమాదాలను నివారించి సురక్షితమైన రవాణా వ్యవస్థను నెలకొల్పాలని కోరారు.

0 కామెంట్‌లు