షెడ్యూల్ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలి: సీఐటీయూ

మీకోసం న్యూస్ ప్రతినిధి -

పెనుకొండ: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 71 రకాల షెడ్యూల్ కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎల్. నరసింహులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 30న కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ శనివారం పెనుకొండ పరిసర ప్రాంతాల్లోని కియా అనుబంధ పరిశ్రమల యాజమాన్యాలకు వినతిపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కనీస వేతనాలను పెంచి దాదాపు 18 సంవత్సరాలు గడిచిపోయాయని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, పిల్లల విద్య, వైద్య ఖర్చులు, కుటుంబ నిర్వహణ వ్యయాలు గణనీయంగా పెరగడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

అందువల్ల ప్రభుత్వం వెంటనే స్పందించి షెడ్యూల్ కార్మికుల కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో కియా అనుబంధ పరిశ్రమల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి. సాంబశివ, జిల్లా కమిటీ సభ్యులు బాబా వలి, కొండ వెంకటేష్, నాయకులు మాబు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు