మీకోసం న్యూస్ ప్రతినిధి -
హిందూపురం: కొడిగేనహళ్లి వద్ద ఉన్న ఫ్రీకాట్ బి మిల్స్ లిమిటెడ్ పరిశ్రమ భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపివేయాలని ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం పరిశ్రమ ప్రధాన గేటు ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్‌తో పాటు ఫ్రీకాట్ ‘బి’ మిల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మారుతి రెడ్డి మాట్లాడుతూ.. మిల్లు కార్మికులకు న్యాయం జరిగే వరకు పరిశ్రమ భూములకు సంబంధించిన ఎలాంటి వ్యాపార లావాదేవీలు చేపట్టరాదన్నారు. ఇంకా సెటిల్మెంట్ పొందని 202 మంది కార్మికులకు తక్షణమే బకాయిలు చెల్లించి న్యాయం చేయాలని యాజమాన్యం, కార్మిక శాఖ అధికారులను కోరారు.
కార్మికుల సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు న్యాయం జరిగేలా సెటిల్మెంట్ చేపట్టకపోతే హైకోర్టులో న్యాయపోరాటం చేసేందుకు ఏఐటీయూసీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు.
ధర్నాలో ఫ్రీకాట్ ‘బి’ మిల్ ఎంప్లాయిస్ యూనియన్ కోశాధికారి రంగప్ప, ఏఐటీయూసీ తాలూకా ఉపాధ్యక్షుడు సమీవుల్లా, సహాయ కార్యదర్శి సిద్ధగిరి సురేష్, నాయకులు హుస్సేన్, అల్లాబకాష్, రామంజి తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు