సోమందేపల్లి, జూలై 12 (మీకోసం న్యూస్): మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సందేశమిస్తూ సోమందేపల్లిలో ఆదివారం మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో 'సే నో టు డ్రగ్స్' పేరుతో 2 కిలోమీటర్ల అవగాహన రన్ నిర్వహించారు. వైఎస్సార్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పెద్దమ్మగుడి, ఎన్టీఆర్ సర్కిల్, కొత్తపల్లి క్రాస్ మీదుగా తిరిగి వైఎస్సార్ సర్కిల్‌కు చేరుకుంది.
ర్యాలీలో వైఎస్సార్‌సీపీ నాయకులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని "సే నో టు డ్రగ్స్", "యువత పెడదారి పట్టొద్దు" అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో యువత, విద్యార్థులు గంజాయి, మాదకద్రవ్యాలు, మద్యానికి బానిసలవుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించేందుకు పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుని యువతను రక్షించాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
-మీకోసం న్యూస్


0 కామెంట్‌లు