తెహ్రాన్: మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. తమ దేశ దక్షిణ ప్రాంతాలపై అమెరికా వైమానిక దాడులకు ప్రతీకారంగా జోర్డాన్, ఖతార్, ఒమన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. అలాగే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు వెల్లడించింది.
ఐఆర్జీసీ అధికారిక మీడియా సంస్థ సెపాహ్ న్యూస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. అమెరికా తమ దక్షిణ తీర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలు, కమ్యూనికేషన్ టవర్లపై వైమానిక దాడులు నిర్వహించిందని ఆరోపించింది. దీనికి ప్రతీకారంగా మూడు దశల్లో ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది.
మొదటి దశలో జోర్డాన్‌లోని ప్రిన్స్ హసన్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ల హ్యాంగర్‌ను ధ్వంసం చేసినట్లు పేర్కొంది.
రెండో దశలో ఖతార్‌లోని అల్ ఉదెయిద్ ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడులు చేసి కమాండ్ సెంటర్, యుద్ధ విమానాల నిర్వహణ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది.
మూడో దశలో ఒమన్‌లోని దుక్మ్ పోర్టులో ఉన్న అమెరికా లాజిస్టికల్ కేంద్రాలపై భారీ దాడులు నిర్వహించినట్లు తెలిపింది. అలాగే కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై కమికాజే డ్రోన్లతో దాడులు చేసి రాడార్ వ్యవస్థలు, ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది.
అమెరికా మరోసారి దాడులకు పాల్పడితే మరింత తీవ్రమైన ప్రతిచర్యలు తప్పవని ఐఆర్జీసీ హెచ్చరించింది. అమెరికా జోక్యం పూర్తిగా నిలిచే వరకు హర్మూజ్ జలసంధి గుండా ఎలాంటి నౌకల రాకపోకలను అనుమతించబోమని స్పష్టం చేసింది.
గమనిక: పై కథనం ఇరాన్ ఐఆర్జీసీ విడుదల చేసిన ప్రకటనల ఆధారంగా రూపొందించబడింది. ఈ ఆరోపణలపై అమెరికా లేదా సంబంధిత దేశాల నుంచి స్వతంత్ర ధృవీకరణ లేదా అధికారిక స్పందన వెలువడితే పరిస్థితులు మారే అవకాశం ఉంది.

0 కామెంట్‌లు