మీకోసం న్యూస్ అమరావతి /పోలవరం: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్‌లోని గ్యాప్-1, గ్యాప్-2తో పాటు పవర్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో పురోగతిని సమీక్షించారు. అనంతరం ప్రాజెక్టు ప్రాంతం నుంచే రాష్ట్రంలోని 36 ప్రాధాన్యతా సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి వర్చువల్ సమీక్ష నిర్వహించారు.
మూడేళ్లలో ఈ 36 ప్రాజెక్టులను పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం రూ.35,313 కోట్లను వెచ్చించనున్నట్లు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు, పోలవరం ఎడమ కాలువతో పాటు ఇతర ప్రాజెక్టుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అలాగే ఏపీఎస్ఐడీసీ ఆధ్వర్యంలో రూ.3,883 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 1,023 సాగునీటి పథకాల పునరుద్ధరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. వీటి ద్వారా సుమారు 8.42 లక్షల ఎకరాలకు స్థిరంగా సాగునీరు అందే అవకాశం ఉందని అధికారులు వివరించారు. కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ ఆధునీకరణలో భాగంగా మన్యం, విజయనగరం జిల్లాల్లో ప్రత్యేక పనులు చేపట్టాలని సీఎం సూచించారు.
భూగర్భ జలాల పెంపునకు చేపట్టిన 'జలధార' కార్యక్రమంలో 100 రోజుల్లో 11,133 చెరువులు, ఫీడర్ ఛానళ్ల అభివృద్ధి పూర్తయిందని అధికారులు తెలిపారు. ఈ పనుల కోసం ప్రతి జిల్లాకు తక్షణమే రూ.2 కోట్ల చొప్పున నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది దేశంలోనే అత్యధికంగా రూ.2,500 కోట్ల వ్యయం చేసినట్లు అధికారులు వెల్లడించారు.


0 కామెంట్‌లు