సోమందేపల్లి: మండల పరిధిలోని ప్రధాన రహదారిపై నడిచే కొన్ని ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు నిర్దేశిత స్టేజీల వద్ద ఆగకుండా వెళ్లిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు ప్రతిరోజూ గంటల తరబడి బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రయాణికుల కథనం ప్రకారం, ఉదయం మరియు సాయంత్రం రద్దీ సమయాల్లో పలువురు డ్రైవర్లు స్టేజీల వద్ద బస్సులను నిలపకుండా నేరుగా వెళ్లిపోతున్నారు. దీంతో అత్యవసర పనులకు వెళ్లేవారు, ఆసుపత్రులకు వెళ్లాల్సిన రోగులు, విద్యార్థులు సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.
స్థానికులు స్పందిస్తూ, గుర్తింపు పొందిన అన్ని బస్ స్టాపుల్లో తప్పనిసరిగా బస్సులు ఆగేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించే డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

0 కామెంట్‌లు