పెనుకొండలో 459 అంగనవాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ

పెనుకొండ, మీకోసం న్యూస్: పెనుకొండ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 459 అంగనవాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లను మంత్రి ఎస్. సవిత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక విద్యాభివృద్ధిలో అంగనవాడీ కేంద్రాల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రతి చిన్నారికి నాణ్యమైన పోషకాహారం, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం, సరైన శిక్షణ అందేలా అంగనవాడీ కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
అంగనవాడీ కార్యకర్తల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. గతంలో రూ.7 వేలుగా ఉన్న గౌరవ వేతనాన్ని రూ.12,500కు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఆమె పేర్కొన్నారు.

అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 'తల్లికి వందనం' పథకం, అంగనవాడీ కార్యకర్త మరణిస్తే అంత్యక్రియల కోసం రూ.15 వేల ఆర్థిక సహాయం, గ్రాట్యుటీని రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు పెంచడం వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.
చిన్నారుల సంక్షేమం, మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ అంగనవాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోందని మంత్రి సవిత స్పష్టం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు