పెనుకొండ, జూలై 18 (మీకోసం న్యూస్): పెనుకొండ నియోజకవర్గ అభివృద్ధికి కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నామని రాష్ట్ర మంత్రి ఎస్. సవిత తెలిపారు.
CSR నిధుల ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు రూ.36 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా KSH కంపెనీ సహకారంతో నియోజకవర్గంలోని 10 బీసీ సంక్షేమ హాస్టళ్లకు 43 అంగుళాల టెలివిజన్లను మంత్రి సవిత శనివారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమం కోసం సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చిన KSH కంపెనీ యాజమాన్యాన్ని అభినందించారు. కార్పొరేట్ సంస్థలు విద్యా రంగానికి అందిస్తున్న సహకారం విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించడంలో, ఆధునిక సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి రాజేంద్రనాథ్ రెడ్డి, KSH కంపెనీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు