పెనుకొండ, జూలై 2(మీకోసం న్యూస్ ): దేశవ్యాప్తంగా ప్రారంభమైన VBRAMG (వీబీ జీరామ్ జీ) కార్యక్రమంలో భాగంగా పెనుకొండ మండలం రాంపురం గ్రామ పంచాయతీలో రాష్ట్ర బీసీ సంక్షేమ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత గురువారం ఉపాధి హామీ పనులను కూలీలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడంతో పాటు వర్షపు నీటిని సంరక్షించే అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఉపాధి పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం వల్ల కూలీలకు అదనపు ఉపాధి, ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు.
ప్రతి అర్హ కుటుంబం ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ పనుల ద్వారా భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయ రంగానికీ మేలు జరుగుతుందని మంత్రి సవిత తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఆర్‌డీవో ఆనందరావు, ఉపాధి హామీ పీడీ, అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.


0 కామెంట్‌లు