సోమందేపల్లి, జూలై 2(మీకోసం న్యూస్ ): శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం నాగినాయనిచెరువు గ్రామంలో 'వికసిత్ భారత్–జీ రామ్ జీ' పథకాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు. అటవీ ప్రాంతంలో ఉపాధి పనులకు వినియోగించే పనిముట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి పథకాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, ఉపాధి హామీ శ్రామికులు పాల్గొన్నారు.
రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ రంగేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ గ్రామీణ కుటుంబాలకు ఉపాధి హామీ పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పనులను ఈ పథకంతో అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు.
జనసేన నాయకుడు రంగేపల్లి నాగరాజు మాట్లాడుతూ శ్రామికులకు త్వరితగతిన వేతనాలు చెల్లించేలా, సాంకేతికతతో పారదర్శకత పెంచేలా ప్రభుత్వం సంస్కరణలు చేపట్టిందన్నారు. పనులు చేసిన వారికి 15 రోజుల్లో వేతనాలు ఖాతాల్లో జమ చేయడంతో పాటు, సాంకేతిక కారణాలతో ఆలస్యం అయితే పరిహారం కూడా అందించే విధానం అమల్లో ఉంటుందని వివరించారు.
అధికారులు మాట్లాడుతూ ఈ పథకం కింద చెరువుల పూడికతీత, పంట కాలువల అభివృద్ధి, భూమి అభివృద్ధి పనులు, ఫార్మ్ పాండ్లు, భూగర్భ జలాల రీచార్జ్ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ, ఏపీఓ సోమశేఖర్ రెడ్డి, ఈసీ అన్నపూర్ణమ్మ, టెక్నికల్ అసిస్టెంట్ రామ్ మోహన్ రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్–ఎంఆర్సీ జగదీష్, ఫీల్డ్ అసిస్టెంట్లు వెంకటేష్ బాబు, శంకర, మూర్తి తదితరులు పాల్గొన్నారు.



0 కామెంట్‌లు