ఒప్పంద ముసాయిదా ప్రతుల దహనం.. అంబేద్కర్ సర్కిల్‌లో ఏపీ రైతు సంఘం నిరసన
అనంతపురం, జూలై 22 (మీకోసం): కేంద్ర ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకోనున్న స్వేచ్ఛా వాణిజ్య (FTA) ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒప్పంద ముసాయిదా ప్రతులను దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. హరి మాట్లాడుతూ, అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే అమెరికా నుంచి పన్నులు లేకుండా చౌకగా దిగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తుల వల్ల దేశ రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే మొక్కజొన్న, మామిడి, పత్తి తదితర పంటల ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ ఒప్పందం అమలైతే ఆహార, వాణిజ్య పంటలు సాగు చేసే సుమారు 11 కోట్ల మంది రైతులు, 8 కోట్ల మంది పాడి రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు కేంద్ర ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, రైతుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు.
ప్రధాన డిమాండ్లు
అన్ని పంటలకు C2+50% ప్రకారం మద్దతు ధరలకు చట్టబద్ధ హామీ కల్పించాలి.
పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతులకు నెలకు రూ.10 వేల పెన్షన్ అందించాలి.
వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలి.
కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు, మండల కార్యదర్శి బాబావలి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు వెంకటరాముడు, రైతులు నరసింహ, ఆనంద్, రాజారావు తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు