మీకోసం న్యూస్ హిందూపురం : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మానస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం ప్రారంభించారు. ఆసుపత్రి వైద్యులు, నిర్వాహకులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించారు.
కొత్తగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిలోని వివిధ విభాగాలను బాలకృష్ణ పరిశీలించి వైద్య సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. హిందూపురం ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించే పెద్ద ప్రైవేట్ ఆసుపత్రి అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. సంక్లిష్ట వ్యాధులకు సైతం స్థానికంగానే చికిత్స అందేలా ఆసుపత్రి ఏర్పాటవడం అభినందనీయమన్నారు.
ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ శశిధర్ కుమార్ మాట్లాడుతూ.. హిందూపురం, పరిసర ప్రాంతాల ప్రజలకు అన్ని వేళలా నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు. క్యాన్సర్, గుండె జబ్బులు, పక్షవాతం, అత్యవసర ప్రమాదాల చికిత్సతో పాటు పలు ప్రత్యేక వైద్య విభాగాలకు అవసరమైన ఆధునిక పరికరాలు, నిపుణుల సేవలు అందుబాటులో ఉంచామని తెలిపారు. దీంతో చిన్నా, పెద్ద వైద్య చికిత్సల కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, బాలాజీ, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బైట్: శశిధర్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ – మానస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.
-మీకోసం న్యూస్


0 కామెంట్‌లు