పెనుకొండ, జూలై 15 (మీకోసం న్యూస్): పెనుకొండ పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ, రూరల్ తెదేపా నాయకుల సమావేశం బుధవారం జరిగింది. సమావేశంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు, పెనుకొండ పట్టణం, మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులు, వార్డు వారీగా చేపట్టాల్సిన కొత్త పనులపై విస్తృతంగా చర్చించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు నిర్ణయించారు. మంత్రి సవితమ్మ కృషితో పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సౌకర్యాలు, సెంట్రల్ లైటింగ్‌తో పాటు అమృత్ పథకం కింద రూ.100 కోట్ల వ్యయంతో ఇంటింటికీ తాగునీటి ప్రాజెక్టు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా కొత్త సామాజిక పింఛన్ల మంజూరు, నిరుపేదలకు ఇంటి స్థలాలు, గృహాల కల్పన, త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వార్డులు, పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పట్టణ తెదేపా అధ్యక్షుడు శ్రీరాములు, రూరల్ మండల కన్వీనర్ ఈశ్వర ప్రసాద్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో వార్డు ఇన్‌చార్జీలు, బూత్, యూనిట్, క్లస్టర్ ఇన్‌చార్జీలు పాల్గొన్నారు.

0 కామెంట్‌లు