రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకులాలు

నసన్నకోటలో బాలికల జూనియర్ కళాశాల ప్రారంభం.. మంత్రి సవిత వెల్లడి

రామగిరి, జూలై 22 (మీకోసం న్యూస్): రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10 కొత్త మహాత్మా జ్యోతిరావు పూలే (ఎంజేపీ) బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించామని, వచ్చే విద్యా సంవత్సరంలో మరిన్ని బీసీ గురుకులాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. కార్పొరేట్ విద్యాసంస్థల సీట్ల కంటే ఎంజేపీ గురుకులాల సీట్లకే అధిక డిమాండ్ ఉందన్నారు.

శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం నసన్నకోటలో బీసీ బాలికల గురుకుల జూనియర్ కళాశాలను బుధవారం స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, బీసీల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.

హాస్టళ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. తరగతి గదులు, వసతి గృహాల్లో దోమలు రాకుండా దోమతెరలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామన్నారు.

ఆరు పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా
ఉమ్మడి రాష్ట్ర విభజన సమయానికి నవ్యాంధ్రలో కేవలం 32 బీసీ గురుకులాలే ఉండేవని గుర్తు చేసిన మంత్రి, 2014–19 మధ్య 75 గురుకులాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా 10 గురుకులాలు ప్రారంభించడంతో పాటు ఆరు బాలికల బీసీ గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసినట్లు చెప్పారు. నసన్నకోట గురుకులం కూడా వాటిలో ఒకటని వెల్లడించారు.

పరిటాల రవికి నివాళి

నసన్నకోట గురుకుల పాఠశాల ఏర్పాటుకు దివంగత నాయకుడు పరిటాల రవి తన సొంతంగా 10 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారని మంత్రి సవిత గుర్తు చేశారు. ఆయన సేవాస్ఫూర్తి ఆదర్శనీయమని కొనియాడారు. ఎమ్మెల్యే పరిటాల సునీత తన సొంత నిధులతో గురుకులాన్ని అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు.

వైసీపీపై విమర్శలు

తమ ఇళ్ల ముందు రోడ్లు కూడా వేయించుకోలేని వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేసిందన్నారు. 'తల్లికి వందనం' పథకం కింద 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10,120.78 కోట్లను జమ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే విద్యామిత్ర కిట్లు, ఎంజేపీ గురుకులాలకు స్పోర్ట్స్ కిట్లను కూడా అందించామని చెప్పారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు