శివాలయాల్లో భక్తుల సందడి మాస శివరాత్రి వేళ ప్రత్యేక పూజలు.. శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు


 సోమందేపల్లి, జూలై 13 (మీకోసం న్యూస్): మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం ఒకే రోజున రావడంతో సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ అరుదైన యోగం నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని పరమేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చాలాకూరు గ్రామ శివాలయం, సోమందేపల్లిలోని శివానగర్ శివాలయం, లక్ష్మీవేంకటేశ్వర కళ్యాణ మండపం సమీపంలోని శివాలయాల్లో విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి శివనామస్మరణ చేస్తూ భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.

పూజారులు స్వామివారికి రుద్రాభిషేకం, అర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయాల్లో "ఓం నమః శివాయ" నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీలు తగిన ఏర్పాట్లు చేశారు.

మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు