ఫిఫా సెమీస్, ఫైనల్ వేళ బెంగళూరులో హోటళ్లకు అదనపు సమయం

బెంగళూరు: ఫిఫా ప్రపంచకప్–2026 సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల సందర్భంగా ఫుట్‌బాల్ అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జులై 14, 15, 19 తేదీల్లో బెంగళూరులోని హోటళ్లు, రెస్టారెంట్లు తెల్లవారుజామున 3:30 గంటల వరకు తెరిచి ఉంచేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. దీంతో అర్ధరాత్రి తర్వాత ప్రసారమయ్యే మ్యాచ్‌లను అభిమానులు ప్రత్యేక స్క్రీనింగ్‌ల ద్వారా వీక్షించే అవకాశం కలగనుంది.
నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. వివిధ దేశాల సమయ వ్యత్యాసం కారణంగా మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రసారం కానుండటంతో ఈ వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో స్పందించిన సీఎం, ప్రజా భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే హోటళ్ల పని వేళలను రాత్రి 1 గంట నుంచి ఉదయం 3:30 గంటల వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ మేరకు కర్ణాటక పోలీస్ చట్టం ప్రకారం అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఫుట్‌బాల్ అభిమానులతో పాటు హోటల్, రెస్టారెంట్ రంగానికీ ఊరట లభించనుంది.
మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు