రాష్ట్ర జీవనాడిపై సీఎం ప్రత్యేక దృష్టి పోలవరం పనులను క్షుణ్ణంగా పరిశీలించిన చంద్రబాబు


 ఏలూరు, జూలై 13 (మీకోసం న్యూస్): రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం క్షుణ్ణంగా పరిశీలించారు. ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా హెలికాప్టర్‌లో ప్రాజెక్టు ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించిన ఆయన, స్పిల్‌వే నుంచి గోదావరి వరద నీటి ప్రవాహంతో పాటు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు.

అనంతరం ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన సీఎం, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్‌ఎఫ్)లోని గ్యాప్–1, గ్యాప్–2 పనుల పురోగతిని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించి, పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రాజెక్టు నిర్మాణం, ప్రస్తుత పరిస్థితి, మిగిలిన పనులపై అధికారులు సీఎంకు సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వెంట ఉన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు