ఆర్థిక వృద్ధికి కేంద్రంగా అమరావతిఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్‌పై సీఎం సమీక్షఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం.. ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

అమరావతి, జూలై 15 (మీకోసం న్యూస్): రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి చోదక శక్తిగా, ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి 2.0 ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఎల్‌పీఎస్-2) పనుల పురోగతిపై బుధవారం ఉన్నతాధికారులు, సింగపూర్ ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు వచ్చి నివసించేలా సమగ్ర ప్రణాళికతో రాజధాని నిర్మాణం చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. సమావేశంలో సింగపూర్ ప్రతినిధులు అమరావతి అభివృద్ధి ప్రణాళిక, మౌలిక వసతులు, పెట్టుబడి నమూనా, దశలవారీ అమలు కార్యాచరణపై ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఉద్యోగాల సృష్టికి ప్రాధాన్యం ఇస్తూ అమరావతి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని సీఎం పేర్కొన్నారు. నగరాన్ని "క్రియేటివ్ సిటీ"గా అభివృద్ధి చేసి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణంతో అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాల నగరంగా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు తెలిపారు. ఎల్‌నినో పరిస్థితులు ఎదురైనా పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించడం వల్ల రాజధాని ప్రాంతంలో నీటి సమస్యలు అధిగమించగలిగామని చెప్పారు.
గ్లోబల్ బెంచ్‌మార్క్‌లకు అనుగుణంగా అభివృద్ధి చేపట్టి రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచడమే లక్ష్యమన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ బిల్డింగ్ విధానాలను అమలు చేస్తున్నామని వివరించారు.
సమీక్షా సమావేశంలో మంత్రి పి. నారాయణ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు