"రోజుకో మాట.. పూటకో వేషం" – జగన్‌పై లోకేశ్ విమర్శలు

చిన్నకొమెర్ల (కడప): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రోజుకో మాట, పూటకో వేషం వేస్తున్నారని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. ఒకరోజు "మావిగన్", మరోరోజు "బెంతాహై" అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన అనంతరం మాట్లాడిన లోకేశ్, రాయలసీమ అభివృద్ధికి జగన్ అడ్డంకిగా మారారని ఆరోపించారు. బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ పేరుతో వేలాది ఉద్యోగాల హామీ ఇచ్చి యువతను మోసం చేశారని విమర్శించారు. తాము తీసుకొచ్చిన కియా పరిశ్రమ ద్వారా వేలాది మందికి ఉపాధి లభించిందని తెలిపారు.
వైసీపీ పాలనలో పరిశ్రమలను బెదిరించి పెట్టుబడిదారులను భయపెట్టారని ఆరోపించిన మంత్రి, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించి, ఇప్పుడు దాల్మియా విస్తరణకు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకువస్తున్నామని చెప్పారు.
వైసీపీని "హిట్ అండ్ రన్ పార్టీ"గా అభివర్ణించిన లోకేశ్, ఉద్యోగాల కల్పనలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే 16 వేల డీఎస్సీ పోస్టులు భర్తీ చేసిందని, త్వరలో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని వెల్లడించారు.
పెట్రోల్, డీజిల్ ధరలపై జగన్ చేస్తున్న విమర్శలను కూడా తిప్పికొట్టిన మంత్రి, రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసి గండికోట జలాలను సమర్థంగా వినియోగిస్తామని స్పష్టం చేశారు.
మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు