ఘనంగా హజ్రత్ సయ్యద్ అక్బర్ హుసేనీ గంధం పూజ

హిందూపురం, జూలై 15 (మీకోసం న్యూస్): మండలంలోని మలుగూరు గ్రామ సమీపంలో వెలసిన హజ్రత్ సయ్యద్ అక్బర్ హుసేనీ స్వామి వారి దర్గా వద్ద బుధవారం రాత్రి గంధం పూజ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
దర్గా పీఠాధిపతి సయ్యద్ షామీర్ జీలానీ బాషా గంధాన్ని తలపై మోసుకుని ఊరేగింపుగా తీసుకొచ్చి హజ్రత్ అక్బర్ హుసేనీ సమాధికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూల చాదర్‌ను సమాధిపై అర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కర్ణాటకలోని దొడ్డబళ్లాపురం నుంచి విచ్చేసిన పీర్ సాబ్ కుమారుడు తాజుద్దీన్ బాబా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్గా వద్ద మొక్కులు చెల్లించుకున్నారు.
దువా, ఫాతేహా కార్యక్రమాల అనంతరం భక్తులకు, గ్రామస్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మలుగూరు గ్రామ పెద్దలు, పెనుకొండ ప్రాంతానికి చెందిన మత పెద్దలు పాల్గొన్నారు.
ప్రతి ఏడాది ఈ గంధం పూజ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతులు సయ్యద్ షామీర్ జీలానీ బాషా సోదరులు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు