అనకాపల్లి, జూలై 15 (మీకోసం న్యూస్): రాష్ట్రంలో సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా వేంపాడు టోల్‌ప్లాజా సమీపంలోని భారతి కన్వెన్షన్‌లో నిర్వహించిన 'అభయ' కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి, పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, "మహిళల భద్రత – మా బాధ్యత" అనే లక్ష్యంతో అనకాపల్లి పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. మహిళలకు ధైర్యం, భద్రత కల్పించేందుకు 'అభయ' కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
మహిళల స్వేచ్ఛ అనేక పోరాటాల ఫలితమని గుర్తుచేసిన ఆమె, ప్రతి ఒక్కరికీ చట్టాలపై అవగాహన ఉండాలని సూచించారు. శక్తి యాప్, శక్తి టీమ్స్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని తెలిపారు.
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, ఆ కష్టాన్ని గుర్తించి ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని, ఎవరైనా వేధిస్తే వెంటనే 112కు కాల్ చేయాలని సూచించారు. చట్టాలు కఠినంగా ఉన్నాయని, క్షణికావేశంలో బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు హితవు పలికారు.
ప్రతి పాఠశాల, కళాశాలలో 'అభయ' ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి అనిత వెల్లడించారు. ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు.
0 కామెంట్‌లు