ఇబ్రహీంపట్నం, జూలై 15 (మీకోసం న్యూస్): రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయడం రాష్ట్ర ద్రోహమే కాక దేశ ద్రోహంతో సమానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ కేఎల్ రావు 124వ జయంతి సందర్భంగా పట్టిసీమ జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గత ప్రభుత్వ సాగునీటి విధానాలపై విమర్శలు గుప్పించారు.
గత ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, గేట్లకు కనీస నిర్వహణ కూడా చేయలేదని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయని విమర్శించారు.
వెలిగొండ ప్రాజెక్టు పూర్తికాకుండానే ప్రారంభోత్సవం నిర్వహించి ప్రజలను తప్పుదోవ పట్టించారని, ఆ బోర్డును మ్యూజియంలో ఉంచి ఆ మోసాన్ని ప్రజలకు చూపిస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రాబోయే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 కీలక సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. పునరావాసానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
1996లో శంకుస్థాపన చేసిన వెలిగొండ తొలి దశను ఈ ఏడాది సెప్టెంబర్ 1న ప్రారంభిస్తామని వెల్లడించారు. వంశధార–నాగావళి–గోదావరి–కృష్ణా–పెన్నా నదుల అనుసంధానం తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గుంటూరు ఛానల్ ఆధునికీకరణ, చింతలపూడి ఎత్తిపోతల, వరికపూడిశెల వంటి పలు ప్రాజెక్టులకు కూడా గడువులు ప్రకటించారు.
డాక్టర్ కేఎల్ రావు, సర్ ఆర్థర్ కాటన్, నందమూరి తారక రామారావు వంటి మహనీయుల సేవలను స్మరించుకున్న సీఎం, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ధవళేశ్వరం, తుంగభద్ర బ్యారేజీల గేట్లను యుద్ధప్రాతిపదికన మార్చామని, వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణాన్ని కూడా చేపడతామని హామీ ఇచ్చారు.
0 కామెంట్‌లు