చెన్నై, జూలై 16 (మీకోసం న్యూస్): ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే తన అద్భుత నటనతో స్టార్ హీరోగా ఎదిగిన 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి చిన్ననాటి కష్టాలను గుర్తు చేసుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, తన జీవిత పోరాటాన్ని పంచుకున్నారు.
చిన్నప్పుడు తమ కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉండేదని, కుటుంబాన్ని పోషించేందుకు తండ్రి చేసిన అప్పులు తీర్చలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. అప్పులిచ్చిన వారు ఇంటికి వచ్చి గొడవ చేసినప్పుడు తండ్రికి అండగా నిలిచేవాడినని తెలిపారు. అయితే ఎన్ని కష్టాలున్నా ప్రతిరోజూ రాత్రి తండ్రి బుల్లెట్‌పై ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చి కుటుంబమంతా కలిసి తినే ఆ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయని చెప్పారు.
నటుడు కావాలనే లక్ష్యం తనకు ఎప్పుడూ లేదని, కుటుంబ బాధ్యతల కోసం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే సినీ రంగంలోకి వచ్చానని విజయ్ సేతుపతి వెల్లడించారు. సినిమాల్లోకి రాకముందు కూలీగా, సేల్స్‌మ్యాన్‌గా, క్యాషియర్‌గా, ఫోన్ బూత్ ఆపరేటర్‌గా పనిచేయడంతో పాటు దుబాయ్‌లో అకౌంటెంట్‌గా కూడా ఉద్యోగం చేశారు.
భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత నాటక రంగంతో ఏర్పడిన పరిచయమే ఆయన సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. చిన్న పాత్రలతో ప్రారంభమైన ప్రయాణం 'తెన్మేర్కు పరువకాట్రు'తో హీరోగా మారగా, 'పిజ్జా', 'సూదు కవ్వమ్', 'విక్రమ్ వేద', 'మహారాజా' వంటి చిత్రాలతో స్టార్ హీరోగా నిలదొక్కుకున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన 'ట్రైన్', 'స్లమ్ డాగ్' చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కష్టాలను జయించి శిఖరాగ్రానికి చేరుకున్న విజయ్ సేతుపతి జీవితం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
0 కామెంట్‌లు