అమరావతి, జూలై 16 (మీకోసం న్యూస్): కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై తనపై కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో జరిగిన పరిణామాలను సమర్థించిన అంబటి, ముద్రగడ మరణానంతరం కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ లాంఛనాల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు. ప్రభుత్వం అందించే అధికారిక లాంఛనాలను కుటుంబ సభ్యులు ముందుగానే తిరస్కరించారని, అయినప్పటికీ పోలీసులు అక్కడికి రావడంపై ప్రశ్నలు లేవనెత్తారు.
"ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలనే ఉద్దేశంతోనే పోలీసులను అడ్డుకున్నాం. ఇందులో ఎలాంటి తప్పు లేదు" అని అంబటి స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర డీజీపీ తనపై ప్రత్యేక నిఘా పెట్టారని ఆరోపించిన అంబటి, రాష్ట్రంలో ఎక్కడ చిన్న సంఘటన జరిగినా తనపైనే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారని అన్నారు. గతంలో అమరావతి, రాజమండ్రి ఘటనల్లో కూడా తనపై అక్రమ కేసులు పెట్టారని పేర్కొన్నారు.
తనపై వంద కేసులు నమోదు చేసినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన అంబటి, "తాను కాపుల ప్రతినిధిని కాదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకున్నప్పుడు, ఆయన ఇంకా కూటమిలో ఎందుకు కొనసాగుతున్నారు?" అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ విధానాలపై కాపు సామాజికవర్గంలో అసంతృప్తి పెరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
0 కామెంట్‌లు