తాడేపల్లి, జూలై 16 (మీకోసం న్యూస్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవినీతి, అప్పులతో పాలన సాగిస్తోందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో జరిగిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ ఎంపీలు గట్టిగా పోరాడాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.
డీఎస్సీ నియామకాలలో తీవ్ర అవకతవకలు జరిగాయని, పోటీ పరీక్షలు లేకుండానే డీఎస్పీ పోస్టులు భర్తీ చేయడం రాష్ట్ర చరిత్రలోనే పెద్ద కుంభకోణమని జగన్ విమర్శించారు. అధికార పార్టీకి అనుకూలంగా ప్రత్యేక జీవోలు జారీ చేసి, అనంతరం వాటిని రద్దు చేశారని ఆరోపించారు.
అమరావతి నిర్మాణంలో చదరపు అడుగుకు రూ.20 వేలకుపైగా ఖర్చు చూపిస్తూ ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారని, ల్యాండ్ పూలింగ్‌కు అంగీకరించని రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారని మండిపడ్డారు.
వైసీపీ హయాంలో రూ.5 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన రామాయపట్నం పోర్టును కేవలం రూ.1,500 కోట్లకే ప్రైవేటు సంస్థలకు అప్పగించారని, ఇది భారీ కుంభకోణమని ఆరోపించారు.
గత రెండేళ్లలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులను ఉల్లంఘిస్తూ రూ.3.6 లక్షల కోట్ల అప్పులు చేశారని, అయినా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. ఇసుక, గనులు, మద్యం తదితర రంగాల్లో మాఫియా రాజ్యమేలుతోందని జగన్ ఆరోపించారు.
0 కామెంట్‌లు