తాడేపల్లి, జూలై 16 (మీకోసం న్యూస్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను డిజిటల్‌గా మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి **'జగన్ 2.0 సూపర్ యాప్'**ను గురువారం ఆవిష్కరించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో యాప్‌ను అధికారికంగా ప్రారంభించారు.
పార్టీ కుటుంబం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వైసీపీ అధికారిక 'ఎక్స్' ఖాతా వెల్లడించింది. కార్యకర్తలు సులభంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్రచార పోస్టర్లను కూడా విడుదల చేసింది.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో కార్యకర్తల పోస్టులు తొలగించబడుతున్న నేపథ్యంలో పార్టీకి సొంత డిజిటల్ వేదిక అవసరమైందన్నారు. ఈ యాప్ ద్వారా కార్యకర్తలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడంతో పాటు పార్టీతో నిరంతరం అనుసంధానమై ఉండవచ్చని తెలిపారు.
పార్టీ నిర్వహించే విలేకరుల సమావేశాలు, నాయకుల పర్యటనలు, అధికారిక ప్రకటనలు, ముఖ్యమైన సమాచారం ఇకపై నేరుగా ఈ యాప్ ద్వారా కార్యకర్తలకు చేరుతుందని పేర్కొన్నారు. త్వరలోనే యాప్‌లో డిజిటల్ డైరీ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
0 కామెంట్‌లు