అమరరాజాకు లోకేశ్ క్షమాపణ.. తెలంగాణ గిగా ఫ్యాక్టరీకి శుభాకాంక్షలు

అమరావతి, జూలై 16 (మీకోసం న్యూస్): తెలంగాణలో అమరరాజా గ్రూప్ అత్యాధునిక గిగా ఫ్యాక్టరీ ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అమరరాజా గ్రూప్ అధినేత, మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు రాజకీయంగా చర్చనీయాంశమైంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరరాజా సంస్థ సొంత రాష్ట్రంలోనే వేధింపులకు గురైందని లోకేశ్ పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల కారణంగానే సంస్థ తన విస్తరణ కోసం పక్క రాష్ట్రాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. "గత ప్రభుత్వ చర్యల వల్ల జరిగిన నష్టానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీకు క్షమాపణ చెప్పాలి" అంటూ గల్లా జయదేవ్‌కు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు.
నాలుగు దశాబ్దాలుగా అమరరాజా సంస్థ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని, వేలాది మందికి ఉపాధి కల్పించి చిత్తూరు జిల్లా పేరును ప్రపంచవ్యాప్తంగా చాటిందని లోకేశ్ కొనియాడారు. అలాంటి సంస్థకు ప్రోత్సాహం అందాల్సింది పోయి ఇబ్బందులు ఎదురవడం బాధాకరమన్నారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా మారిందని మంత్రి స్పష్టం చేశారు. అమరరాజా గ్రూప్ భవిష్యత్ విస్తరణలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామిగా ఉండాలని ఆకాంక్షించారు. "మా తలుపులు.. మా హృదయాలు మీ కోసం ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి" అని పేర్కొంటూ తెలంగాణలో ప్రారంభిస్తున్న గిగా ఫ్యాక్టరీ విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు