పెనుకొండలో మహిళలు, బాలికల భద్రతపై విస్తృత అవగాహన

పెనుకొండ, జూలై 17 (మీకోసం న్యూస్): మహిళలు, బాలికల భద్రతపై అవగాహన పెంపొందించేందుకు పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ సీఐ, ఎస్ఐతో పాటు పీకేడీ ఎస్‌డీ శక్తి టీమ్-1 సభ్యులు పాల్గొని పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థినులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
విద్యార్థినులు వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అసభ్య ప్రవర్తనను ధైర్యంగా ఎదుర్కోవడం, మొబైల్ ఫోన్లను అవసరమైన మేరకే వినియోగించడం, సోషల్ మీడియాలో అపరిచితులను నమ్మకపోవడం వంటి అంశాలపై సూచనలు చేశారు.
పోక్సో చట్టం, బాల్య వివాహాల దుష్పరిణామాలు, మైనర్ల ప్రేమ వ్యవహారాలు, ఇంటి నుంచి పారిపోవడం వల్ల ఎదురయ్యే చట్టపరమైన, సామాజిక సమస్యలను వివరించారు. 18 సంవత్సరాల లోపు వివాహం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు, తల్లి–శిశువు ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని మహిళా వైద్యురాలు వివరించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
అలాగే శక్తి యాప్ వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో 112, 181, 1098 హెల్ప్‌లైన్ నంబర్లను ఉపయోగించే విధానాన్ని వివరించారు. ఎలాంటి అనుమానాస్పద ఘటనలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించి సహాయం అందిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థినులతో పాటు అంగన్‌వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు