తెలుగు గానానికి ఆణిముత్యం జానకమ్మ: పవన్ కల్యాణ్

అమరావతి, జూలై 11 (మీకోసం న్యూస్): ప్రముఖ నేపథ్య గాయని, గాన కోకిల ఎస్. జానకి మరణం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ, తెలుగు గాయనీమణుల్లో జానకమ్మ ఒక ఆణిముత్యమని నివాళులర్పించారు.
జనసేన పార్టీ అధికారిక ప్రకటనలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, జానకి గారి గాత్రం ఎంతో మధురమైనదని, 'నిరీక్షణ', 'సితార', 'స్వాతిముత్యం', 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'ప్రతిఘటన', 'అంతఃపురం' వంటి చిత్రాల్లో ఆమె ఆలపించిన గీతాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.
నాలుగుసార్లు జాతీయ ఉత్తమ గాయని పురస్కారం, పది నంది అవార్డులు అందుకున్న జానకి, తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో 50 వేలకుపైగా పాటలు ఆలపించి సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేశారని కొనియాడారు.
జానకి గారి కుటుంబ సభ్యులకు పవన్ కల్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ తన నివాళులు అర్పించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు