అసలు సమస్యే రాకుండా చూడాలి: అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

అమరావతి, జూలై 14 (మీకోసం న్యూస్): సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించడం కంటే, అసలు సమస్యే తలెత్తకుండా ముందస్తుగా చర్యలు తీసుకునే అధికారులే ఉత్తములని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, శాఖాధిపతులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవాలంటే అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. వినూత్న ఆలోచనలు, డేటా ఆధారిత పాలనతోనే సమర్థవంతమైన పరిపాలన సాధ్యమవుతుందని చెప్పారు.
MERతో పనితీరుపై నెలనెలా సమీక్ష
ఇకపై రాష్ట్ర ప్రగతిని నెలవారీ ఆర్థిక నివేదికలు (MER) ఆధారంగా సమీక్షిస్తామని సీఎం వెల్లడించారు. ప్రభుత్వ శాఖల పనితీరు, రెవెన్యూ వసూళ్లు, అధికారుల సామర్థ్యాన్ని ప్రతి నెలా అంచనా వేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పెట్టుబడులకు ఏపీ ఉత్తమ గమ్యం
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంపై పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతిన్నప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని, 'స్వర్ణాంధ్ర–2047' లక్ష్యాల సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
అర్జీలకు 'జీరో పెండెన్సీ' లక్ష్యం
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. PGRSలో పెండింగ్ లేకుండా కేసులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని, రీసర్వే అనంతరం ప్రతి నెల 9వ తేదీన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
పోలవరం, వెలిగొండపై కీలక ప్రకటనలు
2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం పునరుద్ఘాటించారు. ఆగస్టు 14న పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలు విడుదల చేస్తామని, సెప్టెంబర్ 1న వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని 36 ప్రధాన ప్రాజెక్టులను ప్రాధాన్యతతో పూర్తి చేస్తామని తెలిపారు.
సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు