నేటి నుంచి మూడు రోజుల పర్యటన.. రథయాత్ర, బీజేపీ సమావేశం, కరాటే క్రీడాకారుల సన్మానం, ఐ స్క్రీనింగ్‌లో పాల్గొననున్న మంత్రి
ధర్మవరం, జూలై 18 (మీకోసం న్యూస్): రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ఈ నెల 20, 21, 22 తేదీల్లో ధర్మవరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఆధ్యాత్మిక, రాజకీయ, క్రీడా, ఆరోగ్య రంగాలకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు మంత్రి కార్యాలయం వెల్లడించింది.
జూలై 20న మధ్యాహ్నం 3 గంటలకు ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రారంభమయ్యే శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర మహోత్సవంలో మంత్రి పాల్గొని భక్తులతో కలిసి రథయాత్రలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఎన్డీఏ కార్యాలయంలో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిసి వారి సమస్యలు తెలుసుకోనున్నారు.
జూలై 21న ఉదయం 10 గంటలకు ఎన్డీఏ కార్యాలయంలో బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశమై పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన ధర్మవరం కరాటే క్రీడాకారుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని వారిని అభినందించనున్నారు.
జూలై 22న ఉదయం 10 గంటలకు ధర్మవరం పట్టణంలోని బీఎస్సార్ స్కూల్‌లో నిర్వహించే చిల్డ్రన్ ఐ స్క్రీనింగ్ టెస్ట్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి, చిన్నారులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించనున్నారు. కంటి సమస్యలను ముందస్తుగా గుర్తించి సకాలంలో చికిత్స అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని మంత్రి కార్యాలయం తెలిపింది.
మూడు రోజుల పర్యటనలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రజా సేవ, పార్టీ బలోపేతం, క్రీడా ప్రోత్సాహం, ఆరోగ్య సేవల విస్తరణకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు మంత్రి కార్యాలయం పేర్కొంది.
— మీకోసం న్యూస్
0 కామెంట్‌లు