చిన్నారి లక్ష్మణ్‌కు మంత్రి సత్యకుమార్ అండ విజయవాడకు తరలింపు.. అత్యుత్తమ వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశం


 ధర్మవరం, జూలై 15 (మీకోసం న్యూస్): ధర్మవరం పట్టణంలోని పీఆర్టీ స్ట్రీట్‌కు చెందిన గుడిపాటి శ్రీరామ్ కుమారుడు, ఐదున్నరేళ్ల లక్ష్మణ్ వినికిడి సమస్యతో బాధపడుతున్న విషయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ దృష్టికి చేరడంతో ఆయన వెంటనే స్పందించారు.

చిన్నారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రి సూచనల మేరకు నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్‌బాబు బాధిత కుటుంబాన్ని వారి నివాసంలో పరామర్శించి, చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం లక్ష్మణ్‌ను విజయవాడకు తరలించే ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.

రైలు ప్రయాణం నుంచి వైద్య చికిత్స వరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవాడకు పంపించారు. ఇదే సమయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ విజయవాడలోని రాయుడు ఈఎన్‌టీ ఆసుపత్రి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి, చిన్నారి పరిస్థితిని వివరించారు. అవసరమైన అన్ని వైద్య పరీక్షలు వెంటనే నిర్వహించి, అత్యుత్తమ చికిత్స అందించాలని సూచించారు.

చికిత్సలో ఎలాంటి ఆలస్యం జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య బృందానికి మంత్రి ఆదేశించారు. తమ కుమారుడి చికిత్స కోసం వెంటనే స్పందించి అన్ని ఏర్పాట్లు చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్, అలాగే ప్రతి దశలో అండగా నిలిచిన హరీష్‌బాబుకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు