జిల్లా పార్టీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, శింగణమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం ప్రజా సమస్యలపై జీవితాంతం పోరాడిన నాయకుడని కొనియాడారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పలు బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేశారని అన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, కాపు సామాజిక వర్గ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారని గుర్తుచేశారు. ఎన్నో ఒత్తిడులు ఎదురైనా తన ఉద్యమ స్ఫూర్తిని వీడకుండా ధైర్యంగా నిలిచిన నాయకుడిగా ఆయన చిరస్థాయిగా గుర్తుండిపోతారని పేర్కొన్నారు.
ముద్రగడ మరణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు కాపు సామాజిక వర్గానికి తీరని లోటని, ఆయన ఆశయాలను పార్టీ ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్‌పర్సన్ గిరిజమ్మ, మాజీ మేయర్ వసీం, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

0 కామెంట్‌లు