న్యూఢిల్లీ, జూలై 15 (మీకోసం న్యూస్): వేతన జీవులు సహా అన్ని పన్ను చెల్లింపుదారులు బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. అధిక విలువ కలిగిన నగదు జమలు, క్రెడిట్ కార్డు చెల్లింపులు, స్థిరాస్తి కొనుగోళ్లు, విదేశీ లావాదేవీలు వంటి వివరాలు ఆటోమేటిక్‌గా ఐటీ శాఖకు చేరుతున్నాయని తెలిపింది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 285BA ప్రకారం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నిర్దేశిత లావాదేవీల వివరాలను ఐటీ శాఖకు నివేదించాల్సి ఉంటుంది. ఈ సమాచారం AIS (Annual Information Statement), ఫారం 26ASలో నమోదవుతుంది. ఐటీఆర్‌లో చూపిన ఆదాయానికి ఈ వివరాలు సరిపోలకపోతే నోటీసులు వచ్చే అవకాశం ఉంది.
ఐటీ శాఖ నిఘాలో ఉండే లావాదేవులు
ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ ఖాతాలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్.
క్రెడిట్ కార్డు బిల్లులకు నగదు రూపంలో రూ.1 లక్ష లేదా డిజిటల్ చెల్లింపుల ద్వారా ఏడాదికి రూ.10 లక్షలకు పైగా చెల్లింపులు.
రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన స్థిరాస్తుల కొనుగోలు, విక్రయాలు.
చాలా కాలంగా ఉపయోగించని ఖాతాల్లో అకస్మాత్తుగా భారీ మొత్తంలో నగదు జమలు లేదా ఉపసంహరణలు.
ఏడాదికి రూ.10 లక్షలకు పైగా విదేశీ కరెన్సీ కొనుగోళ్లు, ఇతర అంతర్జాతీయ లావాదేవీలు.
పత్రాలు ఉంటే ఆందోళన అవసరం లేదు
ఆస్తి దస్తావేజులు, రుణ పత్రాలు, గిఫ్ట్ డీడ్‌లు వంటి సరైన ఆధారాలు ఉంటే ఇబ్బంది ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఐటీ శాఖ నోటీసులకు స్పందించకపోవడం లేదా సరైన లెక్కలు చూపించకపోతే చెల్లించాల్సిన పన్నుపై 50% నుంచి 200% వరకు జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఐటీఆర్‌కు ముందు AIS పరిశీలన తప్పనిసరి
జూలై 31లోపు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే వారు ముందుగా తమ AIS, ఫారం 26AS వివరాలను పరిశీలించి, అన్ని ఆదాయ వనరులను కచ్చితంగా వెల్లడించాలని ఐటీ శాఖ సూచించింది.
– మీకోసం న్యూస్
0 కామెంట్‌లు