మడకశిర, జూలై 15 (మీకోసం న్యూస్):
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయితీ పరిధిలోని 5వ వార్డులో ఉన్న చీపులేటి అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు లక్ష్మిరెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం, రికార్డులను పరిశీలించి సేవల తీరును సమీక్షించారు.
గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పంపిణీ చేస్తున్న కోడిగుడ్ల నాణ్యతపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజువారీగా సరఫరా అవుతున్న కోడిగుడ్లలో నాణ్యత లోపాలు ఉన్నట్లు గుర్తించి సంబంధిత కాంట్రాక్టర్‌ను ఫోన్‌లో నిలదీశారు. లబ్ధిదారుల ఆరోగ్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ నెల మూడో వారంలో సరఫరా చేయాల్సిన గ్రీన్ కలర్ గుర్తింపు ఉన్న కోడిగుడ్ల స్థానంలో పింక్ కలర్ గుర్తింపు ఉన్న కోడిగుడ్లు ఉండటాన్ని ప్రశ్నించారు. వెంటనే వాటిని వెనక్కి తీసుకుని నిబంధనల ప్రకారం గ్రీన్ కలర్ గుర్తింపు ఉన్న కోడిగుడ్లను సరఫరా చేయాలని ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రంలో ఉన్న మౌలిక సదుపాయాలు, చిన్నారులకు అందుతున్న సేవలు, ఎదురవుతున్న సమస్యలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పోషకాహారం అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

0 కామెంట్‌లు